వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను బహిష్కరించారు. అంతేకాదు, వలసలపై కఠిన నిర్ణయాలు అమల్లోకి తెచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ, ప్రజా భద్రతను సాకుగా చూపుతూ మరికొన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఏడు దేశాలపై నిషేధం, మరో 15 దేశాలపై ప్రవేశ ఆంక్షలు విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. తాజా నిర్ణయంతో అమెరికాలో ప్రవేశానికి నిషేధం ఉన్న దేశాల సంఖ్య 39కి పెరిగింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం ఐదు దేశాల పౌరులపై అమెరికా పూర్తి స్థాయి నిషేధాన్ని విధించింది. ఇందులో బుర్కినా ఫాసో, మాలి, నైజర్, దక్షిణ సూడాన్, సిరియాలు ఉన్నాయి. వీటితో పాటు పాలస్తీనియన్ అథారిటీ జారీ చేసిన ప్రయాణ పత్రాలు ఉన్నవారు అమెరికాకు వలస రాకుండా పూర్తి నిషేధం విధించారు. గతంలో పాక్షిక ఆంక్షలు ఉన్న లావోస్, సియెర్రా లియోన్ దేశాలను కూడా ఇప్పుడు పూర్తి నిషేధిత జాబితాలోకి మార్చారు. పాక్షిక ఆంక్షలు విధించిన దేశాల జాబితాలో అంగోలా, ఆంటిగ్వా & బార్బుడా, బెనిన్, ఐవరీ కోస్ట్, డొమినికా, గాబన్, గాంబియా, మలావి, మౌరిటేనియా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి


