రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రామ్ చరణ్ తన కెరీర్‌లోనే అత్యంత భిన్నమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఆయన నటన, ఎమోషనల్ సన్నివేశాలు, స్పోర్ట్స్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. అయితే సినిమా విజయంతో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రపై మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రేక్షకులతో పాటు సినీ విశ్లేషకుల నుంచి కూడా ఆమె పాత్రకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథలో ఆమె పాత్రకు సరైన ప్రాధాన్యం లేదని, పాత్ర రూపకల్పన బలహీనంగా ఉందని అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.
పెద్ది విడుదలైన తొలి రోజు నుంచే జాన్వీ కపూర్ పాత్రపై మిశ్రమ స్పందన వచ్చింది. కథ మొత్తం హీరో చుట్టూనే తిరగడంతో హీరోయిన్‌కు పెద్దగా స్కోప్ దక్కలేదని చాలామంది అభిప్రాయపడ్డారు. కొన్ని సన్నివేశాలు కథా ప్రవాహానికి పెద్దగా ఉపయోగపడలేదనే కామెంట్లు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో జాన్వీ పాత్ర కేవలం కమర్షియల్ అవసరాల కోసమే చేర్చినట్టుగా ఉందని కొందరు విమర్శకులు పేర్కొన్నారు. సినిమా విడుదల తర్వాత ప్రమోషనల్ కార్యక్రమాల్లో కూడా జాన్వీ పెద్దగా కనిపించకపోవడం ఈ చర్చలకు మరింత ఊతమిచ్చింది. దీంతో ఆమె సినిమాపై ఆసక్తి చూపలేదా? లేక నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ కారణంగా దూరంగా ఉందా? అనేచర్చ జరుగుతోంది.


