భారత ప్రయాణికులకు ఫ్రాన్స్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫ్రాన్స్ మీదుగా ఇతర దేశాలకు వెళ్లే భారతీయులకు ఇక నుంచి ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ వీసా అవసరం లేదని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 10వ తేదీ నుంచే అమల్లోకి వచ్చిందని భారత్‌లోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. సాధారణ పాస్‌పోర్ట్ ఉన్న భారతీయ పౌరులు ఫ్రాన్స్‌లోని విమానాశ్రయాల్లో వేచి ఉండి, అక్కడి నుంచి మూడో దేశానికి వెళ్లేటప్పుడు ట్రాన్సిట్ వీసా మినహాయింపు వర్తిస్తుంది. అయితే ప్రయాణికులు విమానాశ్రయంలోని అంతర్జాతీయ జోన్ దాటి బయటకు రాకూడదు. కేవలం లేఓవర్ సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో ఉండే వారికి మాత్రమే ఈ సౌలభ్యం అందుబాటులో ఉంటుంది.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటన సందర్భంగా, భారతీయులకు ప్రయాణ నిబంధనలు సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 9న ఫ్రాన్స్ అధికారిక గెజిట్‌లో ఇందుకు సంబంధించిన సవరణ ఉత్తర్వులను ప్రచురించారు. ఈ మార్పులకు అనుగుణంగా అధికారిక ఫ్రాన్స్-వీసాస్ ప్లాట్ఫామ్లో సమాచారాన్ని కూడా అప్డేట్ చేసినట్టు రాయబార కార్యాలయం తెలిపింది. ఈ నిర్ణయంతో ఫ్రాన్స్ మీదుగా యూరప్, అమెరికా వంటి దేశాలకు వెళ్లే వేలాది మంది భారతీయులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.


