తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరు ఫ్రీ అయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. పాత పేరు, కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆడబిడ్డకు ఓటు వేయాలన్న అంశం కంటే మించిన ఎమోషన్ ఏముంటుంది? అని ప్రశ్నించారు. తమ పార్టీ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే నడుస్తుందని, తమ పార్టీకి బిహార్ సిద్ధాంతకర్త ఎవరూ లేరని తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని, పునర్విభజన అయినా, కాకపోయినా తమ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంటుందని పేర్కొన్నారు. సిద్ధిపేట స్థానం మహిళలకు రిజర్వు కాదా? ముఖ్యమంత్రి, గుంటనక్క హరీష్ రావు మధ్య అవగాహనతో ఏం చేస్తారో? అని ప్రశ్నించారు. సిఎం ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ ను ఆగం చేసేలా ఉన్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్, అమరావతి గురించి తమకు అవసరం లేదని అన్నారు. తాను కేసు కొట్టి వేశారంటేనే ప్రకృతి తనకు సహకరిస్తుందని, తమ అజెండా ప్రకటించాక, చాలా మంది పార్టీలోకి వస్తారని అన్నారు. ఆరు గ్యారెంటీల గురించి కేరళలో రేవంత్ రెడ్డి మాటలు విడ్డూరంగా ఉన్నాయని, మహారాష్ట్ర, బీహార్ లో కూడా ఇలాగే చెప్పారని, కాంగ్రెస్ ను ఓడించారని ఎద్దేవా చేశారు. ప్రైవేట్ పాఠశాలలు 25 నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచాయని, నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాశాఖ సిఎం వద్దే ఉన్నా, ఫీజుల విషయంలో, గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నా రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.


