దేశంలో జనగణనకు రంగం సిద్ధమైంది. తొలి విడత ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నది. మొదటి దశలో భాగంగా గృహ గణన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా 33 ప్రశ్నలను అడుగుతారని కేంద్రం తెలిపింది. రెండో దశలో జనాభా లెక్కల్ని సేకరిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇది ప్రారంభం కానున్నది. జనగణన కోసం పౌరులు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ), జన గణన కమిషనర్ మృత్యుంజయ కుమార్ నారాయణ్ మీడియాతో మాట్లాడుతూ ఈసారి తొలిసారిగా పౌరులు సెల్ఫ్-ఎన్యుమరేషన్ ద్వారా స్వయంగా తమ సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు.
ఇది ఇంటింటి సర్వే ప్రారంభానికి 15 రోజుల ముందు అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. భారత్‌లో నివసిస్తున్న పౌరులకు మాత్రమే సెల్ఫ్-ఎన్యుమరేషన్ ఆప్షన్ వర్తిస్తుందని చెప్పారు. మరికొద్ది రోజుల్లో పలు రాష్ర్టాల్లో ఇంటింటి సర్వే ప్రారంభం కాబోతున్నదని, జనాభా లెక్కల సమయంలో సేకరించే పౌరుల వ్యక్తిగత సమాచారం గోప్యమైందని, ఆర్టీఐ కింద గానీ, కోర్టుల ముందు సాక్ష్యంగా గానీ, మరే ఇతర సంస్థతోనూ పంచుకోరాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సారి జన గణనతో పాటు కుల గణన కూడా చేపట్టనున్నారు.


