మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 130 మంది మావోయిస్టులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు లొంగిపోయారు. నాలుగు బస్సులలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్న మావోయిస్టులు, సీఎం రేవంత్ రెడ్డికి తమ ఆయుధాలను సరెండర్ చేసి లొంగిపోయారు. 31 ఏకే 47 తుపాకులు, 124 ఆయుధాలు సరెండర్ చేశారు. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ దళం మొత్తం లొంగిపోయినట్లు తెలిసింది. లొంగిపోయినవారిలో ఏవోబీ కీలక నేత చలసాని నవత కూడా ఉన్నారు.
మరోవైపు తెలంగాణ స్టేట్ కమిటీ మొత్తం లొంగిపోయినట్లు తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు.లొంగిపోయిన వారిలో 125 మంది మావోయిస్టులు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన వారు. తెలంగాణకు చెందిన వారు నలుగురు ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఒకరు ఉన్నట్లు డీజీపీ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో స్టేట్ కమిటీకి చెందిన వారు ముగ్గురు, డివిజనల్ కమిటీకి చెందిన10మంది, 40మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. అలాగే 70 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు ఉన్నట్లు డీజీపీ వివరించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన సూచన మేరకు మావోయిస్టులు లొంగిపోతున్నట్లు తెలిపారు.


