పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, శ్రీలీల కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్తగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఉగాది కానుకగా మార్చి 19వ తేదీన ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో కథానాయిక రాశి ఖన్నా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే కథ కూడా వినకుండా ఎంతో ఉత్సాహంతో వెంటనే ఈ చిత్రానికి ఓకే చెప్పేశాను. నేను నా మొదటి సినిమా చేస్తున్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్ గురించి, పవనిజం గురించి విన్నాను. అప్పుడే ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలి అనుకున్నాను. ఉస్తాద్ భగత్ సింగ్ తో నా కల నెరవేరింది. ఈ సినిమాలో నా పాత్ర పేరు శ్లోక. తను చాలా మోడరన్ అమ్మాయి. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంది. నా పాత్రకు కూడా మంచి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. నాకు ఇందులో ఒక మాస్ సాంగ్ ఉంది. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి, ఆ సాంగ్ షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను. ఇక పవన్‌కళ్యాణ్ నుంచి మానవత్వం నేర్చుకున్నాను.
ఉస్తాద్ వేడుకలో స్టేజ్ మీద నుంచి పవన్ అభిమానులను చూస్తుంటే, ఆయనను ఒక దేవుడిలా ఆరాధిస్తున్నట్లు అనిపించింది. హరీష్ శంకర్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. షూటింగ్ సమయంలో సెట్‌లోనే పంచ్ డైలాగ్స్ రాసి ఇస్తుంటారు. సినిమా పట్ల ఆయన అంకితభావం చూసి చాలా నేర్చుకున్నాను. సినిమాలో శ్రీలీలతో కలిసి సన్నివేశాలు లేవు. ప్రతి పాత్ర దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. నా పాత్రలో కూడా మంచి వేరియేషన్స్ ఉంటాయి. ఇది ఒక ఫ్యామిలీ సినిమా, అందరూ కలిసి థియేటర్‌లో చూడొచ్చు. ఉగాది పండుగ సమయంలో వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. వింటేజ్ పవన్ కళ్యాణ్‌ని ఈ సినిమాలో చూస్తారు అని అన్నారు.


