ఇటీవల మృతి చెందిన ఒక గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండలం, పొలాస గ్రామానికి చెందిన ఆరెల్లి గంగారాజం గల్ఫ్‌లో ఉండగా అనారోగ్యం పాలై కోమాలోకి వెళ్లడంతో స్వదేశానికి తరలించాల్సి వచ్చింది. ఇక్కడ చికిత్స పొందుతూ పదిరోజులు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బాధితుడి కుటుంబానికి అండగా నిలిచింది. సీఎం ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి, సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్, ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్‌లు హైదరాబాద్ ప్రజాభవన్‌లో మృతుడి భార్య ఆరెల్లి రాజవ్వకు చెక్కును అందజేశారు.
కిడ్నీ సంబంధిత వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆరెల్లి గంగారాజం (61) 2025 నవంబర్ 12న దుబాయిలోని ఆస్టర్ హాస్పిటల్లో చేరారు. చివరకు కోమా స్థితిలోకి వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం డిసెంబర్ 14న హైదరాబాద్‌కు తరలించి, నిమ్స్‌లో చేర్చారు. అనంతరం రీహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందారు. చివరకు జగిత్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డిసెంబర్ 24న మరణించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్, అంబాసిడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ప్రవాసీ ప్రజావాణి కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.


