తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుతో ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం ముగియనుంది. ఆ వెంటనే సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, రాష్ట్ర పరిపాలనపై ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. 1992 బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయనను తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. అయితే, 2014 అక్టోబర్ నెలలో డిప్యూటేషన్ పైన కేంద్ర సర్వీసుకు వెళ్లిన సంజయ్ జాజు, 2018, మార్చి వరకు ఎన్‌హెచ్‌ఐడీసీఎల్ డైరెక్టర్‌గా, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. 2024 నుంచి కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజును తిరిగి మాతృ రాష్ట్ర కేడర్‌కు (తెలంగాణకు) పంపుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

































