తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఏప్రిల్ 23న (బుధవారం) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ప్రచారానికి ఆఖరి రోజున ప్రధాన పార్టీలన్నీ రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తించాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన కోలత్తూరు నియోజకవర్గంలో ప్రచారాన్ని ముగించగా, విపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి ఎడప్పాడిలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. సుమారు 5.6 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును వెల్లడించనున్నారు. ఈసారి ఎన్నికలు కేవలం డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్యే కాకుండా త్రిముఖ పోరును తలపిస్తున్నాయి. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం తొలిసారి బరిలోకి దిగడం రాజకీయ సమీకరణాలను మార్చేసింది. విజయ్ స్వయంగా పెరంబూరు నుంచి పోటీ చేస్తుండటంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఆయన చేసిన ప్రచారానికి యువత, మహిళల నుంచి విశేష స్పందన లభించింది. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగిన విజయ్, అటు డీఎంకే, ఇటు ఏఐఏడీఎంకే ఓటు బ్యాంకుకు గండి కొడతారనే చర్చ నడుస్తోంది.


