తెలంగాణలో కొత్త వాహనం కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసేందుకు వీలు కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త విధానం అమలు కోసం అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రాబోయే 15 రోజుల్లో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీని ప్రకారం, వాహన డీలర్లే కొనుగోలుదారుడి నుంచి అవసరమైన పత్రాలను (ఇన్వాయిస్, ఫారం-21, ఫారం-22, ఇన్సూరెన్స్, చిరునామా ధ్రువీకరణ పత్రం) తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. రవాణా శాఖ అధికారి ఆ పత్రాలను ఆన్లైన్లోనే పరిశీలించి, డిజిటల్‌గా ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) కార్డును నేరుగా యజమాని చిరునామాకు పోస్టులో పంపిస్తారు.


