ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోసం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్‌ను కలుస్తామని తెలిపారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీల బిల్లుకు మద్దతు కోసం అన్నిపార్టీలకు లేఖలు రాస్తామని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఏపీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన చరిత్ర అసెంబ్లీకి ఉందని ప్రస్తావించారు.
ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు, బీజేపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టిందని తెలిపారు. ప్రైవేట్ మెంబర్ బిల్లును పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రైవేట్ మెంబర్ బిల్లును బీజేపీ వ్యతిరేకించినా ఇబ్బంది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం కోటి మోసాలు చేసిందని ధ్వజమెత్తారు. ప్రజల నుంచి ఓట్లు రాబట్టడానికి అడ్డగోలు హామీలు ఇచ్చిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీల హామీల అమలు చట్టం ఫైల్‌పై సంతకం చేశారని ఉభయ సభల్లో గత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ప్రసంగంలో చెప్పారని ప్రస్తావించారు అన్ని పేర్కొన్నారు.


