తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర మొదలైంది.కన్నెపల్లి కల్పవల్లి సారలమ్మ గద్దెను చేరడంతో మేడారం మహాజాతరలో తొలి అంకం మొదలైంది. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి వద్ద సారలమ్మకు స్వాగతం పలుకగా, ముగ్గురి రాకతో మేడారమంతా సంబురంతో ఓలలాడింది. వనదేవతల దర్శనానికి జనం ప్రవాహంలా తరలివచ్చింది. అటు జంపన్న వాగు జనసందోహంతో కిక్కిరిసిపోయింది. రెండేండ్ల ఎదురుచూపుల తర్వాత సారలమ్మ గద్దెకు చేరుకోవడంతో ఒక్కసారిగా భక్తకోటి పరవశించిపోయింది. సారలమ్మ.. సల్లంగ సూడు తల్లీ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా భక్తిపారవశ్యం తో ఊగిపోయింది. కన్నెపల్లి నుంచి మేడారం వరకు భక్తజనం సారలమ్మకు జేజేలు పలుకు తూ ప్రణమిల్లింది. తొలి ఘట్టం ఎలాంటి ఆ టంకాలు లేకుండా పరిపూర్ణమైంది.
సారలమ్మ రాక కోసం తెల్లవారుజాము నుం చే భక్తజనం తాకిడి మొదలైంది. సారలమ్మను తోడ్కొని వచ్చే ప్రధాన పూజారి(వడ్డె) కాక సా రయ్య సహా ఇతర వడ్డెలు తొలుత గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల తర్వాత ఆనవాయితీ ప్రకారం కన్నెపల్లి నుంచి 16మంది ఆడబిడ్డలు డోలి విన్యాసాలతో తరలివచ్చి తల్లీబిడ్డలైన సమ్మక్క-సారలమ్మ కొలువుదీరే గద్దెలపై ముగ్గులు పెట్టి కంక వనానికి కంకణాలు కట్టారు. మధ్యాహ్నం 3గంటల నుంచే సారలమ్మ గుడి వద్ద డోలి విన్యాసాలు, తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి పరిషత్, సారక్క యువజన సంఘం బృందాల కళా ప్రదర్శనలు నాలుగు గంటల పాటు కోలాహలం నెలకొన్నది.
మంత్రి సీతక్క, జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కన్నెపల్లి సారలమ్మ గుడి నుంచి మేడారంలోని గద్దెల వరకు తోడ్కొని బయలుదేరారు. కన్నెపల్లిలో ఇల్లిల్లూ తమ ఇంటి ఆడబిడ్డకు నీళ్లారగించి, చీరసారె పెట్టి, కొబ్బరికాయలు కొ డుతూ మంగళహారతులు పట్టారు. కన్నెపల్లిలో వాడవాడనా తిరుగుతూ సారలమ్మను సాగనంపారు. అక్కడినుంచి రాత్రి జంపన్న వాగుకు చేరుకున్నది. జంపన్న తన అక్క సారలమ్మ కాళ్లు కడిగి(జంపన్నవాగు మీద జంట వంతెనలున్నా సరే కోయ జాతి సంప్రదాయం ప్రకారం వాగులోంచే సారలమ్మను తీసుకురావడం ఆనవాయితీ) మేడారానికి సాగనంపారు. జంపన్నవాగు నుంచి బయలుదేరిన సారలమ్మకు పగిడిద్దరాజు, గోవిందరాజుల వడ్డెలు స్వాగతం పలికారు. ముగ్గురి దేవతల ప్రతినిధులు ప్రత్యేక పూజలు చేయగా డోలి విన్యాసాలు, కొమ్ముబూరల నాదంతో మేడారం మార్మోగింది.


