కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ల భేటీ ముగిసింది. పార్టీ పెద్దల తీరుపై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి.. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి, బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో జీవన్ రెడ్డిని కలిసిన మంత్రులు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. చాలా సమయం జీవన్ రెడ్డితో చర్చలు జరిపిన మంత్రులు,పార్టీలో ఆయనకు సముచిత ప్రాధాన్యం దక్కేలా అధిష్ఠానం చూసుకుంటుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, వీరి బుజ్జగింపులు సఫలీకృతం అయినట్లుగా కనిపించడం లేదు. జీవన్ రెడ్డితో భేటీ అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. పార్టీ మారే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని జీవన్ రెడ్డిని కోరామని మంత్రి తెలిపారు. జీవన్ రెడ్డికి పార్టీ అండగా నిలబడే ఆలోచన చేస్తుందన్నారు. ఆయనతో చర్చించిన అంశాలను పార్టీ, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.
మంత్రులతో సమావేశం అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ మార్పుపై పట్టు వీడలేదని, ప్రాధాన్యం లేనప్పుడు పార్టీలో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. మంత్రులు పార్టీలో కొనసాగాలని కోరారు. మీకో దండం అంటూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి ససేమిరా అని, తన నిర్ణయంలో మార్పులేదని, పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తానని జీవన్ రెడ్డి అన్నారు. మంత్రులకు వచ్చినందుకు థ్యాంక్స్ అని జీవన్ రెడ్డి చెప్పారు.


