రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ శిక్షణ డీసీసీ అధ్యక్షులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. వారి అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీ విధానాలు, ప్రజల సమస్యలపై చర్చించేందుకు ఈ తరగతులు సహాయపడతాయని అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందని విమర్శించారు. భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. గాంధీ సిద్ధాంతాలను విశ్వసించే పార్టీ కాంగ్రెస్ అని ఆయన గుర్తుచేశారు. గాంధీజీపై లాఠీలు ఎత్తడానికి బ్రిటిషర్లు బయపడ్డారని, దేశభక్తులమని అనుకునే కొందరు తూటాలతో గాంధీని చంపారని విమర్శించారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయని, గాంధీ ఆలోచనలపై కూడా భిన్నాభిప్రాయాలు చెప్పినవారు ఉన్నారని తెలిపారు. భిన్నాభిప్రాయాలు చెప్పిన వారిని తరిమేస్తే మనకే నష్టం, అందరూ కలిసి పనిచేస్తే అనుకున్నది సాధించవచ్చు అని అన్నారు. రెండున్నర శాతం ఓట్ల నుంచి 40 శాతం వరకు కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చామన్నారు. డిజిటల్ మెంబర్‌షిప్‌పై దృష్టి పెట్టాలని సూచించారు.
పార్టీ బాధ్యతలు తీసుకున్న వారిని వెతికి మరీ పదవులు ఇచ్చామని చెప్పుకొచ్చారు. నాయకుల ప్రతీ కదలికను గమనిస్తూనే ఉంటామని, మెరిట్ కోటా తప్ప కాంగ్రెస్‌లో ఏ కోటా లేదని స్పష్టం చేశారు. మెరిట్ కోటాలో పాస్ అయితేనే పదవులు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చాలా విలువైనదని, ఈ పదవిని దుర్వినియోగం చేస్తే దేవుడు కూడా కాపాడలేడన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి మీ ఉన్నతికి తొలిమెట్టు అని పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్ అగ్రనాయకులను అవమానపరచాలని బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదని రేవంత్ పేర్కొన్నారు.


