టాలీవుడ్ విలక్షణ నటుడు, దర్శకుడు రవిబాబు స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తూ రూపొందించిన చిత్రం రేజర్. ఈ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. క్రైమ్ మరియు యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను చూస్తుంటే, ఈ చిత్ర కథాంశం ఒక చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ఓ వ్యక్తి శక్తివంతమైన రాజకీయ మరియు నేర వ్యవస్థతో చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది. తాజాగా విడుదలైన ట్రైలర్లో రవిబాబు అత్యంత భయంకరంగా, రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచేశారు. మరోవైపు ఈ చిత్రం విడుదల తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. మే 8వ తేదీ రవిబాబు తండ్రి, దివంగత ప్రముఖ నటుడు చలపతిరావు గారి జయంతి కావడంతో, ఆయన జ్ఞాపకార్థం అదే రోజున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.
ఈ చిత్రాన్ని సురేష్ బాబు సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. రవిబాబు దర్శకత్వం వహించడమే కాకుండా కథను కూడా ఆయనే అందించారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. రాజేష్ సంగీతం అందించగా, చరణ్ మాధవనేని ఛాయాగ్రాహకుడిగా, సతీష్ పొలోజు యాక్షన్ కొరియోగ్రఫర్‌గా వ్యవహరించారు. వేసవి కానుకగా విడుదలవుతున్న ఈ ‘రేజర్’ బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.


