అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా మైథికల్ థ్రిల్లర్ చిత్రం వృషకర్మ. కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్‌ని రాజస్థాన్‌లో పూర్తిచేసుకున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, స్పర్ష్ శ్రీవాస్తవ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌కు చెందిన సుకుమార్ రైటింగ్స్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
మరోవైపు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారతీయ ప్రేక్షకులు ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా, ఒక అద్భుతమైన మైథికల్ థ్రిల్లర్ అనుభూతిని అందించేందుకు భారీ స్థాయిలో విఎఫ్ఎక్స్ పనులు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు మరియు శ్రీ నాగేంద్ర ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.


