హీరో వంశీ తుమ్మల నటిస్తున్న చిత్రం శ్రీ చిదంబరం గారు. సంధ్యా వశిష్ట కథానాయిక. దర్శకుడు వినయ్ రత్నం. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు బుచ్చిబాబు సానా లాంచ్ చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.మెల్లకన్ను కారణంగా తన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎప్పుడూ కళ్ళద్దాలు ధరించే కథానాయకుడు, ఒక అమ్మాయితో ప్రేమలో పడిన తర్వాత తన బలహీనతను ఎలా అధిగమించాడనేది ఈ సినిమా ప్రధానాంశం. వంశీ తుమ్మల ఈ పాత్ర కోసం ప్రత్యేకమైన మేనరిజమ్స్‌తో కష్టపడగా, సంధ్యా వశిష్ట కథానాయికగా ఆకట్టుకున్నారు. ఈ చిత్రం గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయే నేటి యువతకు తమ లోపాన్నే బలంగా మార్చుకోవాలని చెప్పే ఒక నిజాయితీ గల స్ఫూర్తిదాయకమైన ప్రయత్నమని ప్రశంసించారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని చింతా వినీషా రెడ్డి మరియు చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. చందు రవి సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి గారు ఒక పాట పాడటం విశేషం. నీ లోపం నీకు బలహీనత కాకూడదు, అది నీ బలం అవ్వాలి అనే చక్కని సందేశంతో వస్తున్న ఈ గ్రామీణ ప్రేమకథ ఫిబ్రవరి 6 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


