అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ ఒక్కసారిగా భారీ లేఆఫ్స్‌కు శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 1.62 లక్షల మంది సిబ్బందిలో 18 శాతం, అంటే దాదాపు 30,000 మందిని తొలగించినట్లు సమాచారం. వీరిలో ఏకంగా 12,000 మంది భారతదేశానికి చెందిన ఉద్యోగులే కావడం గమనార్హం. వేలాది మంది ఉద్యోగులకు ఒకేసారి లేఆఫ్ మెయిల్స్ పంపించారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వారి రోల్స్ అవసరం లేదని పేర్కొంటూ తొలగింపు ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 31నే వారి చివరి పనిదినంగా ప్రకటించడంతో పాటు, కంపెనీ ల్యాప్‌టాప్‌లు, సిస్టమ్‌ల యాక్సెస్‌ను వెంటనే నిలిపివేయడం ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.
ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడింది. ఒరాకిల్ ఇండియాలో సుమారు 30,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వారిలో గణనీయమైన శాతం ఈ కోతలకు గురైనట్లు సమాచారం. అమెరికా, కెనడాలో తొలగించిన ఉద్యోగుల్లో కూడా పెద్ద సంఖ్యలో భారతీయులే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మేనేజీరియల్ స్థాయిలో ఉన్న ఉద్యోగులే ఎక్కువగా ఈ వేటుకు గురైనట్లు సమాచారం. ఇది ఒక్క విడత మాత్రమేనని, ఇంకా మరిన్ని లేఆఫ్స్ ఉండే అవకాశం ఉందన్న వార్తలు ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతున్నాయి. ఏ సమయంలోనైనా మరో చేదు వార్త వినాల్సి వస్తుందేమోనని ఐటీ ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు.


