ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో అన్యమతస్థుల ప్రవేశంపై బద్రీ-కేదార్ ఆలయ కమిటీ (బి.కె.టి.సి) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బద్రీనాథ్, కేదార్‌నాథ్‌తో పాటు కమిటీ పరిధిలోని 47 ఆలయాల్లోకి ఇకపై సనాతన ధర్మంపై నమ్మకం లేని వారికి ప్రవేశం ఉండదని కమిటీ స్పష్టం చేసింది. అన్యమతస్థులు ఎవరైనా ఈ క్షేత్రాలను దర్శించుకోవాలంటే, తమకు సనాతన ధర్మంపై పూర్తి విశ్వాసం ఉందని తెలుపుతూ ఒక అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందని కమిటీ ప్రకటించినట్లు సమాచారం. అయితే ఈ కొత్త రూల్ బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌కి సమస్య తెచ్చేలా కనిపిస్తుంది.
సారా అలీ ఖాన్ తరచుగా కేదార్‌నాథ్‌ను సందర్శిస్తుందన్న సంగతి అందరికి తెలిసిందే. కేదార్‌నాథ్‌పై ఉన్న ఇష్టంతోనే కేదార్‌నాథ్ (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా) అనే సినిమాలో కూడా నటించింది సారా. అయితే బి.కె.టి.సి పెట్టిన తాజా నిబంధనలు ఆమెపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక నటి సారా అలీ ఖాన్ తరచుగా కేదార్‌నాథ్‌ను దర్శించుకుంటున్న నేపథ్యంలో ఆమె ప్రవేశం గురించి మీడియా ప్రశ్నించగా బి.కె.టి.సి చైర్మన్ హేమంత్ ద్వివేది స్పందిస్తూ.. సారా అలీ ఖాన్‌కు సనాతన ధర్మంపై నమ్మకం ఉండి, ఆమె అఫిడవిట్ సమర్పిస్తే ఖచ్చితంగా దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.


