ధాన్యం సేకరణలో దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఏ సమస్యా లేదని తెలిపారు. కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రైతుల నుంచి ధాన్యం సేకరించలేకపోవటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం, రైస్ మిల్లర్లు, అధికారులు, దళారీల మధ్య రైతులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
యాసంగి సీజన్‌కు సంబంధించి 52.24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా, శనివారం వరకు 51.80 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఎందుకు సేకరించారని ప్రశ్నించారు. గోనె సంచులను సిద్ధంగా ఉంచుకోవాలన్న సోయి ఆరు నెలల ముందే ఎందుకు లేదు? ఎంతసేపూకమీషన్లు, కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి ఉంది. ఆ మంత్రి ఎంత కమీషన్ తీసుకున్నారు? ఈ మంత్రి ఎంత తీసుకున్నారు? నేనెంత తీసుకోవాలి అనే మంత్రులు ఆలోచిస్తున్నారు తప్ప రైతుల గురించి పట్టించుకోవడం లేదు అని మండిపడ్డారు. పది పంటలకు బోనస్ ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రం నుంచి నాణ్యమైన సన్న బియ్యాన్ని క్వింటాల్‌కు రూ.4,000-4,200ల చొప్పున ఇతర రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నాణ్యత లేని సన్నబియ్యాన్ని క్వింటాల్‌కు రూ.3,000-3,200 చొప్పున తీసుకొచ్చి ఇక్కడి పేదలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణి చేస్తోంది అని ఆరోపించారు. ధాన్యం సేకరణ కోటాను పెంచేలా తాను కూడా ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు.


