పశ్చిమబెంగాల్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇస్తూ స్పీకర్ రతీంద్ర బోస్ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి కేటాయించిన ఛాంబర్ తాళాలను కూడా సిబ్బంది రితబ్రతకు ఇచ్చేశారు. అసెంబ్లీలో పార్టీ నేతగా శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయ్‌ను తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఎంపిక చేయడంతో పార్టీలో కలకలం రేగిన విషయం తెలిసిందే. ఆయన నాయకత్వాన్ని అంగీకరించబోమంటూ మొత్తం 80 ఎమ్మెల్యేల్లో 59 మంది తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. ఆ తరువాత రితబ్రత సారథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిశారు. తామే టీఎంసీ అని, రితబ్రతకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని లేఖను సమర్పించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ తాజాగా రితబ్రతను ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేశారు.


