హనుమాన్ జయంతి సందర్భంగా పలు సినిమా అప్‌డేట్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న రామాయణ్ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఇదే కాకుండా బాలీవుడ్ నుంచి మరో రామాయణ్ సినిమా తెరకెక్కుతుంది. వాల్మీకి రామాయణం అంటూ ఈ సినిమా రాబోతుండగా, నేడు హనుమాన్ జయంతి కానుకగా సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. గత నెలలో శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కేవలం శ్రీరాముడి పాదాలను మాత్రమే చూపించి సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్ర బృందం, తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో శ్రీరాముడి పట్ల హనుమంతుడికి ఉన్న అచంచలమైన భక్తి, వినయాన్ని ఎంతో అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ పోస్టర్ చూస్తే రామాయణాన్ని సాంస్కృతిక విలువలకి అద్దం పట్టేలా తెరకెక్కిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకురాలు భావనా తల్వార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే భారతీయ సినిమాలోని దిగ్గజాలు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ వినోద్ ప్రధాన్ మరియు ఆస్కార్ గ్రహీత, సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి వంటి ప్రముఖులు ఈ సాంకేతిక బృందంలో ఉన్నారు. ఆనంద్ నీలకంఠన్ మరియు చంద్రప్రకాష్ ద్వివేది ఈ చిత్రానికి కథను అందిస్తుండగా, ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


