అమెరికా జాతీయ స్థాయి ఆవిష్కరణల పోటీలో తెలుగమ్మాయి ఇషాన్వి సబ్నివీసు సత్తా చాటింది. అమెరికా జాతీయ ఇన్నోవేషన్ పోటీలో టాంపా తెలుగమ్మాయి ద్వితీయ బహుమతి అందుకుంది. 35 రాష్ట్రాల నుంచి పాల్గొన్న 3లక్షల మంది విద్యార్థుల్లో తెలుగు తేజం ఇషాన్వి సత్తా చాటడం విశేషం. దృష్టి లోపం ఉన్నవారి కోసం స్టెయిన్‌బ్రెన్నర్ హైస్కూల్ విద్యార్థిని ఆవిష్కరించిన ఏఐ-పవర్డ్ స్మార్ట్ కేన్ కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ ప్రాజెక్ట్ విజయంలో హైదరాబాద్ కు చెందిన టెక్నాలజీ స్టార్టప్ క్వాడ్రిక్ ఐటీ కీలకపాత్ర పోషించింది.
అమెరికాలోని ఫ్లోరిడాలోని స్టెయిన్‌బ్రెన్నర్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న తెలుగు విద్యార్థిని ఇషాన్వి సబ్నివీసు అమెరికా జాతీయ స్థాయి ఆవిష్కరణల పోటీలో అద్భుతమైన విజయం సాధించింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్వెన్షన్ కన్వెన్షన్ యూఎస్ నేషనల్స్ లో 35 రాష్ట్రాల నుంచి పాల్గొన్న 3 లక్షలకుపైగా విద్యార్థులను వెనక్కి నెట్టుకుంటూ ఆమె ద్వితీయ బహుమతి కైవసం చేసుకుంది. దృష్టి లోపం ఉన్నవారి స్వతంత్ర, సురక్షిత ప్రయాణం కోసం ఇషాన్వి రూపొందించిన ఎనేబుల్డ్ స్మార్ట్ కేన్ ఈ ఘనతకు కారణమైంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే పేటెంట్ దరఖాస్తు దశలో ఉంది. ఆమె ప్రయాణం యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో జరిగిన ప్రాంతీయ పోటీలతో ప్రారంభమై, జాతీయ స్థాయిలో మెరిసింది.

































