జులై 31, ఆగష్టు 1,2 తేదీల్లో మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్‌లో జరగనున్న 19వ అమెరికా తెలుగు సంఘం (ఆటా) మహాసభలకు మేరీల్యాండ్ రాష్ట్ర గవర్నర్ వెస్ మూర్‌ను ఆటా అధ్యక్షుడు చల్లా జయంత్ ఆహ్వానించారు. మేరీల్యాండ్ రాష్ట్రంలో తొలిసారిగా జాతీయస్థాయి తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా జయంత్ గవర్నర్‌కు వివరించారు. 15వేల మందికి పైగా ఈ వేడుకకు హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు. అనంతరం మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్‌ను కలిసి ఆమెను కూడా ఈ సభలకు ఆహ్వానించారు. ఇరువురు సానుకూలంగా స్పందించారని ఆటా ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమంలో సభల కన్వీనర్ బానాల శ్రీధర్, ట్రస్టీలు మట్టపల్లి రామ్, కో-కోఆర్డినేటర్ జీనత్ కుందూర్ తదితరులు పాల్గొన్నారు.


