ప్రతిష్ఠాత్మక శ్రీ అమర్నాథ్ జీ యాత్ర-2026 లాంఛనంగా ప్రారంభమైంది. సోమవారం పవిత్ర గుహాలయంలో ప్రథమ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ కార్యక్రమంలో పాల్గొని, యాత్ర సన్నాహాలకు అధికారికంగా శ్రీకారంచుట్టారు. ఈ సందర్భంగా ఆయన మంచులింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తన సంతోషాన్ని పంచుకున్నారు.
హర హర మహాదేవ్! శ్రీ అమర్నాథ్ జీ పవిత్ర గుహలో ప్రథమపూజ నిర్వహించడం నిజంగా నా అదృష్టం. ఇది వార్షిక యాత్రకు లాంఛనమైన ప్రారంభం. బాబా బర్ఫానీ ఆశీస్సులతో ప్రజలందరూ శాంతి, శ్రేయస్సు, సంపూర్ణ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించాను అని ఆయన పేర్కొన్నారు.
ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి, రక్షా బంధన్ పండుగలతో ముగుస్తుంది. మొత్తం 57 రోజులపాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రను సురక్షితంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మనోజ్ సిన్హా తెలిపారు. యంత్రాంగం, పుణ్యక్షేత్రాల బోర్డు, సైన్యం, పోలీసులు, ఇతర భద్రతా దళాలు, స్థానిక ప్రజలు, సేవా ప్రదాతలు, వాలంటీర్లు అందరూ పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నారు. భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని అందించడానికి సర్వం సిద్ధం చేశాం అని ఆయన భరోసా ఇచ్చారు.

































