అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను దేశం నుంచి పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని ప్రకటించింది. బలవంతంగా కాకుండా, వారంతట వారే స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేవారికి భారీ ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఇలా వెళ్లేవారికి 2,600 డాలర్లు (సుమారు రూ.2.40 లక్షలు) ఎగ్జిట్ బోనస్ గా ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
ఈ నగదు ప్రోత్సాహకంతో పాటు, వారి స్వదేశాలకు వెళ్లేందుకు అయ్యే విమాన ప్రయాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించనుంది. ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే వారు సీబీపీ హోమ్ అనే ప్రత్యేక యాప్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నమోదు చేసుకున్న వారిని బలవంతపు బహిష్కరణ జాబితా నుంచి తొలగిస్తారు. గతంలో 1,000 డాలర్లుగా ఉన్న ఈ బోనస్‌ను, ట్రంప్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా 2,600 డాలర్లకు పెంచింది. ఇప్పటివరకు ఈ విధానంలో సుమారు 22 లక్షల మంది అమెరికాను వీడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.


