నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం దేశ రాజధాని ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది.ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ఎన్నికలకు సంబంధించి ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తిని ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ స్థానంలో దుష్యంత్ నరియాలను నియమించింది. మరోవైపు హోంశాఖ కార్యదర్శి జగదీశ్ ప్రసాద్ మీనాపైనా ఈసీ వేటు వేసింది. ఈ పదవిలో ఐఏఎస్ అధికారి సంఘమిత్ర ఘోష్‌ని నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఎన్నికలు పూర్తయ్యేంతవరకు నందిని చక్రవర్తి, జగదీశ్ ప్రసాద్ మీనాకు ఎలాంటి పోలింగ్ సంబంధిత విధులు అప్పగించవద్దని పశ్చిమబెంగాల్ సర్కారును ఈసీ ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధుల్లో ఈ అధికారులు పాల్గొనకూడదని ఈసీ తను రాసిన లేఖలో పేర్కొన్నది. ఎన్నికల సన్నద్ధతను సమీక్షించిన తర్వాత ఆ ఇద్దరినీ విధులకు దూరంగా ఉంచినట్టు తెలిపింది. తమ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలియజేసింది.


