తమిళనాడు బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో సమావేశమై తన రాజీనామా లేఖను సమర్పించారు. కాగా, మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై, 2020లో బీజేపీలో చేరి అనతికాలంలోనే రాష్ట్రంలో కీలక నేతగా ఎదిగారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోను అన్నామలైకి చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టికెట్ నిరాకరించింది బీజేపీ. అంతకుముందు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాద్యతల నుంచి తప్పించింది. దీంతో అప్పట్నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేసినప్పటికీ ఆయన దానిని తిరస్కరించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం తమిళనాడు బీజేపీలో చర్చనీయాంశంగా మారగా, అన్నామలై భవిష్యత్ రాజకీయ అడుగులపై ఆసక్తి నెలకొంది. ఆయన త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.


