ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధంలో అమెరికా దళాలకు మరో ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేయడం, దానిలో ఉన్న ఇద్దరు పైలట్లలో ఒకరు గల్లంతైన విషయం తెలిసిందే. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ విమానాన్ని కూడా కూల్చేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డులు ప్రకటించారు. పైలట్‌ను రక్షించామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత ఇరాన్ అందించింది. దాని ప్రకారం…కూలిపోయిన యుద్ధ విమానానికి చెందిన పైలట్ కోసం గాలింపు జరుపుతున్న అమెరికా రెస్క్యూ విమానం సీ-130ని ఇస్ఫహాన్ దక్షిణ ప్రాంతంలో ఐఆర్‌జీసీ ధ్వంసం చేసింది. గాలింపు చర్యలు చేపట్టిన విమానాలకు రీఫ్యూయలింగ్ చేయడానికి సీ-130 వచ్చింది. అయితే అందులోని సిబ్బంది ఏమైందీ తెలియలేదు. గాలింపు సమయంలో ఇరాన్ దళాలు అనేక అమెరికా విమానాలను ధ్వంసం చేశాయి. ఈ సందర్భంగా ఇరాన్ దళాలు జరిపిన దాడులలో ఐదుగురు చనిపోయారు. కూల్చివేతకు గురైన వాటిలో సీ-130 విమానంతో పాటు రెండు బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు కూడా ఉన్నాయి.


