తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌కు మరో షాక్ ఎదురైంది. ఆయన నేతృత్వంలోని డీఎంకేతో 9 ఏళ్లుగా కలిసి ఉన్న ఎండీఎంకే ఆ కూటమి నుంచి వైదొలగింది. పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రభుత్వాన్ని స్వాగతించడంతో పాటు ఎన్నికల హామీల విషయంలో రాజీపడకుండా వ్యవహరించాలని ఒక తీర్మానంలో కోరింది. అవినీతి రహిత పాలన అందించాలని, మెకెదాటు డ్యామ్ ప్రాజెక్ట్ వంటి అంశాలపై తమిళనాడు హక్కులను పరిరక్షించడం వంటి వాటిపై ప్రభుత్వం దృఢంగా ఉండాలని సూచించింది. అయితే అధికార టీవీకే కూటమి వైపు ఎండీఎంకే మొగ్గుచూపుతున్నప్పటికీ అందులో చేరడం గురించి ఆమోదించిన తీర్మానాల్లో స్పష్టంగా ప్రస్తావించలేదు.
కాగా, డీఎంకే కూటమి నుంచి వైదొలగడాన్ని ఎండీఎంకే సమర్థించుకున్నది. తమ పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలు జరిగాయని విమర్శించింది. అలాగే తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి డీఎంకే వద్ద ఒక రహస్య ప్రణాళిక ఉన్నట్లు ఆరోపించింది. ఈ పరిస్థితుల వల్ల డీఎంకే కూటమిలో కొనసాగడం అసాధ్యమని పేర్కొంది.

































