అమెరికాకు చెందిన విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా దేశీయ మార్కెట్లోకి మరో మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆరుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ వైఎల్ మాడల్ ధర రూ.61.99 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటికే విడుదల చేసిన వై మాడల్‌కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన రావడంతో ఈ నూతన మాడల్‌ను పరిచయం చేసింది. 5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకోనున్న ఈ కారు సింగిల్ చార్జింగ్‌తో 681 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. ప్రీమియం ఎస్‌యూవీ వాహన విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ నయా మాడల్‌ను తీసుకొచ్చినట్టు టెస్లా ఇండియా జనరల్ మేనేజర్ శరద్ అగర్వాల్ తెలిపారు.


