ప్రజా రాజధాని అమరావతి అని, తీర్మానం ఆమోదం తర్వాత కేంద్రానికి పంపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇకపై రాజధాని అమరావతికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. శాతవాహనులు అమరావతి నుంచే పాలన సాగించారని గుర్తుచేశారు. ఆ కాలం నాటి అమరావతి విశేషాలను బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారని తెలిపారు. తెలుగువారిని గతంలో మదరాసీలు అని పిలిచేవారని, టీడీపీ ఆవిర్భావం తర్వాత మదరాసీ అనే ముద్ర పోయిందని చంద్రబాబు గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు చేసిన పార్టీ టీడీపీ అని ఆయన పేర్కొన్నారు. విభజన సమయంలో సమన్యాయం కోసం తాము కోరినట్లు చంద్రబాబు చెప్పారు. ఆనాడు పార్లమెంట్‌లో జగన్ కనిపించకుండా దాక్కున్నారని విమర్శించారు. విభజన తర్వాత ఏపీలో కార్యాలయాలు లేవని, బస్సులో ఉండి పరిపాలన చేశామని ఆయన వెల్లడించారు. అమరావతిలో అసెంబ్లీ, సచివాలయ భవనాలను కేవలం 9 నెలల్లోనే పూర్తి చేశామని వెల్లడించారు.


