ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల, ఏపీ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూలై మొదటి వారంలో ఈ విమానాశ్రయం ప్రారంభం కానుండటంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోనున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తుది దశకు చేరుకున్నాయి. జూలై 5వ తేదీ లేదా 8వ తేదీన ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇప్పటికే ఆహ్వానం పంపారు. మోదీ షెడ్యూల్ ఆధారంగా జూలై 5వ తేదీ లేదా 8వ తేదీల్లో ఒకటి ఖరారు కానుంది. జూన్ 30వ తేదీ కల్లా మిగిలిన అన్ని పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అదనపు సిబ్బందిని మోహరించి రాత్రింబవళ్లు పనులు కొనసాగిస్తున్నారు.
అంతర్జాతీయ విమానాల రాకపోకల కోసం అవసరమైన ఇమ్మిగ్రేషన్ స్టేటస్ నోటిఫికేషన్‌ను త్వరగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ విమానాశ్రయాన్ని కస్టమ్స్ ఎయిర్‌పోర్ట్‌గా కేంద్రం నోటిఫై చేసింది. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది.


