ఉన్నత చదువుల కోసం, పర్యటన నిమిత్తం బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. స్టూడెంట్, విజిటర్, వర్క్ వీసాలతో పాటు అన్ని కేటగిరీల వీసా దరఖాస్తు రుసుములను పెంచుతున్నట్లు బ్రిటన్ హోమ్ ఆఫీస్ అధికారికంగా ప్రకటించింది. సవరించిన ఈ కొత్త ఛార్జీలు ఏప్రిల్ 8వ తేదీ నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో విదేశీయులపై దాదాపు 6 నుంచి 7 శాతం వరకు అదనపు ఆర్థిక భారం పడనుంది.
గతంలో 524 పౌండ్లు (రూ.65,730)గా ఉన్న విద్యార్థి వీసా రుసుము ఇప్పుడు 558 పౌండ్లకు (రూ.69,814) పెరిగింది. అలాగే మూడేళ్ల కాలపరిమితి గల వర్క్ వీసా ఫీజు 769 పౌండ్ల ( రూ.96,466) నుంచి 819 పౌండ్లకు (రూ.1,02,470) చేరింది. అదేవిధంగా మూడేళ్లకు పైబడిన దరఖాస్తుల రుసుము 1,519 పౌండ్ల ( రూ.1,90.550) నుంచి 1,618 పౌండ్లకు ( రూ.2,02,437) పెరిగింది. ఇది మాత్రమే కాకుండా ఆరు నెలల కాల పరిమితి గల పర్యాటక వీసా ఛార్జీ 127 పౌండ్ల నుంచి 135 పౌండ్లకు ( రూ.15,935 నుంచి రూ.16,890) పెరిగింది. ఇక స్పాన్సర్ లైసెన్స్ ఫీజులు, ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఇ టిఎ) ఛార్జీలను కూడా ప్రభుత్వం సవరించింది. ప్రతి ఏటా వేల సంఖ్యలో భారతీయ విద్యార్థులు బ్రిటన్‌కు వెళ్తుంటారు. ఇప్పటికే అక్కడ జీవన వ్యయం పెరగడంతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు.. ఇప్పుడు పెరిగిన వీసా ఫీజులు అదనపు తలనొప్పిగా మారనున్నాయి.


