హన్మకొండ జిల్లాలోని హనుమాన్ నగర్లో అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి నిరంజన్ కుటుంబానికి టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ అండగా నిలిచారు. ఇటీవల ఈ బాలుడి కోరిక మేరకు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన నిర్మాత బండ్ల గణేష్ సైతం స్పందించి, హన్మకొండలోని బాలుడి నివాసానికి చేరుకుని నిరంజన్ను పరామర్శించారు.
బాలుడి నివాసానికి వెళ్లిన బండ్ల గణేష్, నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిరంజన్ తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కల్పించిన ఆయన, బాలుడి వైద్య ఖర్చుల నిమిత్తం తన వంతు సహాయంగా రూ. 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును బాలుడి తల్లిదండ్రులకు స్వయంగా అందజేశారు.

































