టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టుతో మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలని పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం పెద్ద దుమారం రేపుతోంది. ఎంపిక పద్ధతిన మెగా టోర్నీలో పాక్ జట్టు ఆడాలనుకోవడాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి తప్పు పడుతోంది. పాక్ ప్రభుత్వం, ఆ దేశ బోర్డు తమ నిర్ణయాన్ని మార్చుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది కూడా. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి సైతం తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. తాము ఐసీసీ నిబంధనలను పాటిస్తామని, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ మాదిరిగా పూటకో మాట, రోజుకో విధంగా ప్రవర్తించడం తమకు తెలియదని బీసీసీఐ పేర్కొంది.
స్వదేశంలో మొదలయ్యే పొట్టి ప్రపంచకప్ కోసం పక్కాగా సిద్ధమైన భారత జట్టు టైటిల్ నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డనుంది. సన్నాహక సిరీస్‌లో విజయంతో కొండంత ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా ట్రోఫీ వేటకు కాచుకొని ఉంది. షెడ్యూల్ ప్రకారం లీగ్ దశలో సూర్యకుమార్ యాదవ్ సేన ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో తలపడాలి. కానీ, ఇండియాతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించడం చర్చనీయాంశమైంది. దాయాదుల బిగ్ ఫైట్ చూడాలనుకున్న కోట్లాదిమంది ఒకింత షాక్ అవుతున్నారు. అయితే, బీసీసీఐ మాత్రం పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని తేలికగానే తీసుకుంది. తాము ఐసీసీ ప్రొటోకాల్ పాటిస్తామని, షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న భారత జట్టు కొలంబో స్టేడియానికి వెళ్తుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.


