రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం సరికొత్త చరిత్రను సృష్టించింది. బెంగళూరు – కడప – విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నాలుగు గిన్నిస్ రికార్డులను దక్కించుకుంది. నేషనల్ హైవే అథార్టీ, కాంట్రాక్ట్ సంస్థ రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఒకే హైవే స్ట్రెచ్‌పై ఏకంగా నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించి రికార్డు నెలకొల్పాయి. ఈ అసాధారణ ఇంజినీరింగ్ ప్రతిభను ప్రశంసిస్తూ కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ, సీఎం చంద్రబాబు ఎన్హెచ్ఏఐ అధికారులకు, రాష్ట్ర యంత్రాంగానికి, రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ నెల 5న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం సాతర్లపల్లి వద్ద ఈ ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ నెల 6 బొంతలపల్లి సమీపంలో 28.89 లేన్ కిలోమీటర్ల పొడవైన రహదారిని 24 గంటల్లోపు పూర్తి చేసి మొదటి రికార్డు సృష్టించింది.24 గంటల్లో అత్యధికంగా 10వేల 655 టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను నిరంతరం వేసి రెండో రికార్డు సాధించింది. ఈ నెల 11 వరకు 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను నిరంతరంగా వేసి మూడో రికార్డును నెలకొల్పింది. ఈ రికార్డు నెలకొల్పడం కోసం 70 టిప్పర్లు, 5 హాట్ మిక్స్ ప్లాంట్లు, 17 రోలర్లు, అత్యాధునిక సెన్సార్ పేవర్లను వినియోగించింది. మొత్తం 156 లేన్ కిలోమీటర్ల పొడవైన రహదారిని నిరంతరంగా నిర్మించి నాలుగో రికార్డును సృష్టించింది.


