కాంగ్రెస్, మిత్రపక్షాలు మహిళా బిల్లును అడ్డుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ మహిళలకు రిజర్వేషన్లు వస్తాయని ఆశపడ్డారని అన్నారు. మహిళలకు ద్రోహం చేయడం జాతి విద్రోహమని, మహిళలను గౌరవించి అన్ని రంగాల్లో ఆదరించడం సంస్కృతని తెలియజేశారు. సంస్కృతి, సంప్రదాయాలకు భిన్నంగా ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రారంభం మాత్రమే మహిళా లోకమంతా ఏకమైందని, మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనే నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు.
చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని విపక్షాలు ఆరోపించాయని, దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్రం స్పష్టత ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నామని, పోరాడి సాధించుకునే సమయంలో అడ్డుకోవడం క్షమించరాని నేరమని విమర్శించారు. విపక్ష పార్టీలు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాయని ప్రశ్నించారు. ఆడబిడ్డలను ఇంటి వరకే పరిమితం చేయాలని దుర్మార్గ ఆలోచనని మండిపడ్డారు. శుక్రవారం విద్రోహ దినమని విపక్షాల ద్రోహాన్నిప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని, మహిళా సాధికారత కోసం అడ్డంకులు సృష్టించకూడదనే కర్తవ్యం విపక్షాలపై ఉందని అన్నారు. 2017లో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని, 2029 నాటికి మహిళలకు రిజర్వేషన్ల అమలు యోచనతో కేంద్రం ముందుకొచ్చిందని అన్నారు. ఇంట్లో ఆడబిడ్డలు పైకి వస్తే చూడలేని పరిస్థితి ఉందని, మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ఓడించడం దుర్మార్గమని మండిపడ్డారు. వదిలిపెట్టే సమస్యలేదని, విపక్షాలకు డిపాజిట్లు రాకుండా చేయాలని అప్పుడే మహిళలకు న్యాయం జరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.


