మాంసం విక్రయాలపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్స్, ఇతర విద్యాసంస్థలు, దేవాలయాల పరిసరాల్లో అన్నిరకాల మాంసం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇటీవల బిహార్ డిప్యూటీ సీఎం, అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్టర్ విజయ్ కుమార్ సిన్హా ఆదేశాలు జారీ చేశారు. ఇకపై విద్యాసంస్థలు, దేవాలయాల పరిసరాల్లో మాంసం, చేపలు, గుడ్లు వంటివి అమ్మడానికి వీల్లేదు.ఈ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయ్ కుమార్ హెచ్చరించారు.
ఇటీవల తాను వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా వచ్చిన ఫిర్యాదులు, సలహాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజలు మాంసం తినడానికి మేం వ్యతిరేకం కాదు. కానీ, వాటి నుంచి వచ్చే వాసనతో అటు విద్యార్థులు, ఇటు దేవాలయాల్లో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా టెంపుల్స్‌కు వచ్చే భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలుగుతోంది. అలాగే, మాంసం షాపుల కారణంగా విద్యార్థుల హింసాత్మక ధోరణి పెరగొచ్చు. అందుకే స్కూల్స్, ఇతర విద్యాసంస్థలు, దేవాలయాలు, వాటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, సామాజిక సామరస్యానికి దోహదపడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అని ఆయన తెలిపారు. జిల్లా అధికారులు ఈ నిబంధనల్ని అమలు చేయాలని, ఒకవేళ రూల్స్ అతిక్రమిస్తే బిహార్ మున్సిపాలిటీ యాక్ట్ 2007 ప్రకారం చర్యలు తప్పవన్నారు.


