ఆస్ట్రేలియా లోని సిడ్నీ నగరం లో యూదులపై ఉగ్ర దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ భయానక దాడి సమయంలో అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉగ్రవాదులకు ఎదురెళ్లి గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో బోండీ బీచ్ హీరోకు తాజాగా అరుదైన గౌరవం లభించింది. అహ్మద్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వం నేషనల్ బ్రేవరీ అవార్డ్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు.
ఈ నెల 14న బోండి బీచ్‌లో ఉగ్రదాడి సమయంలో అహ్మద్ తన స్నేహితుడితో కలిసి కాఫీ షాప్‌లో కాఫీ తాగుతున్నారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించగానే భయంతో బయటికి పరుగులు తీశారు. అక్కడ మారణహోమం జరుగుతుండటాన్ని చూసి అహ్మద్ చలించారు. ఇంట్లో విషయం చెప్పమని స్నేహితుడికి చెబుతూ ఉగ్రవాదిపై దాడి చేశాడు. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా తెగింపు ప్రదర్శించాడు. ఈ క్రమంలో అతడికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను సిడ్నీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


