దొరలకు సమస్యలపై అవగాహన ఉండకపోవచ్చని, పేదల మధ్య పెరిగిన తనకు సమస్యలు తెలియవా? అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని మిడ్జిల్‌లో కృతజ్ఞత సభ జరిగింది. సభలో రేవంత్ మాట్లాడుతూ తట్ట పనికి, మట్టి పనికి మనమే కావాలి కానీ, పరిపాలనకు పాలమూరు బిడ్డలు పనికిరారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.అహంకారులకు బుద్ధి చెప్పాలా? వద్దా? అని ప్రశ్నించారు. గద్దర్ అన్నను గడీ ముందు నిలబెట్టినవారికి ఉరిశిక్ష వేసినా తక్కువే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిగులు బడ్జెట్‌తో అప్పగిస్తే, అప్పుల రాష్ట్రంగా మార్చారు. పదేళ్లలో కేసీఆర్ కుటుంబంలో వారికే పదవులు వచ్చాయి. ప్రజాపాలన ఎందుకు పోవాలో ఎక్కడికక్కడ చర్చ పెట్టండి. రేషన్ కార్డులు, సన్నబియ్యం ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలా? ఉచిత కరెంట్ ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలా? గంజాయి, డ్రగ్స్‌ను నియంత్రించినందుకు ప్రజాపాలన పోవాలా? మీ దోపిడీకి అడ్డుకట్ట పడినందునే, ప్రజాపాలన పోవాలని కోరుకుంటున్నారు. ప్రతిదాంట్లో కమీషన్లు తిన్నారు. బతుకమ్మ చీరల్లోనూ అవినీతికి పాల్పడ్డారు కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు పెరిగితే, తెలంగాణకు అప్పులు మాత్రమే మిగిలాయి. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. సమస్యలపై ప్రతిపక్ష నేత మాట్లాడరంట. అధికారం ఇస్తే దోచుకోవడానికి మాత్రం వస్తారట. వాళ్లు దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఆలోచించాలి. అరుంధతి సినిమాలో పశుపతిలా, కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌లో బంధించాం. ఫామ్‌హౌస్ నుంచి కేసీఆర్ బయటికొచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్‌కు అధికారం అన్నది కలే. బీఆర్ఎస్‌కు గతం తప్ప భవిష్యత్ లేదు. మళ్లీ కాంగ్రెస్ రావాలి. రాహుల్ ప్రధాని కావాలి. రాహుల్‌ను ప్రధానిగా చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది అని అన్నారు.

































