రెండేళ్లలో పాలమూరు- రంగారెడ్డి పూర్తి చేస్తానని ఆనాడు మాజీ సిఎం కెసిఆర్ అన్నారని మంత్రి జూపల్లి కృష్ణా రావు తెలిపారు. ఈ సందర్భంగా సిఎల్పి కార్యాలయంలో జూపల్లి మీడియాతో మాట్లాడుతూ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు 90శాతం పూర్తిచేసినట్లు బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం దారుణమన్నారు. రూ. లక్షకోట్ల ప్రాజెక్టుపై రూ.25 కోట్లే ఖర్చు పెట్టారని, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ కాంగ్రెస్ హయాంలో వచ్చినవేనని, కాళేశ్వరం పూర్తిచేసినట్లు పాలమూరు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు? అని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డికి కావాల్సిన 90 టిఎంసిలు తెచ్చి తీరుతామని అన్నారు. పాలమూరు- రంగారెడ్డికి కావాల్సిన 90 టిఎంసిలు బిఆర్ఎస్ తేలేకపోయిందని, పాలమూరుపై బిఆర్ఎస్ ది సవతి తల్లి ప్రేమని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాలపై హక్కులను టా కట్టి పెట్టింది కెసిఆర్ అని ఎన్నికల్లో లబ్ధి కోసమే బిఆర్ఎస్ నేతలు ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం కన్నా ఎక్కువే వరి కొనుగోలు చేశామని పేర్కొన్నారు.


