దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో లాంగ్వేజ్ విధానంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. రాబోయే 2026 జులై 1 నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు భాషల విధానాన్ని తప్పనిసరి చేస్తూ సీబీఎస్‌ఈ అధికారికంగా సర్క్యులర్ జారీ చేసింది. జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి 2020), నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్(ఎన్ సిఎఫ్-ఎస్ఈ 2023) సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.
2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఎన్‌సీఈఆర్‌టీ విడుదల చేసిన నూతన సిలబస్‌ను సమీక్షించిన తర్వాతే ఈ మార్పులు చేసినట్లు బోర్డు స్పష్టం చేసింది. ఏప్రిల్‌లోనే విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా జులై నుంచి ఒక పరివర్తన ప్రక్రియ ద్వారా దీనిని అమలు చేయనున్నారు.


