కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటి రోడ్డు-రైలు హైబ్రిడ్ అండర్‌వాటర్ టన్నెల్ నిర్మిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 18, 600 కోట్లతో వస్తున్న ఈ ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్ అప్రూవ్ చేసింది. అస్సాంలోని బ్రహ్మపుత్ర నది అడుగున ఆధునిక రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ప్రతిష్ఠాత్మక ప్రణాళికకు ఈ ప్రాజెక్టుతో బీజం పడింది. నది కిందుగా రోడ్డు-రైలు మార్గాలను కలిపే దేశపు తొలి అండర్‌వాటర్ సొరంగం నిర్మించేందుకు అనుమతి లభించింది. ఈ ప్రాజెక్ట్‌ను అత్యాధునిక ట్విన్ ట్యూబ్ టన్నెల్ బోరింగ్ మెషిన్ (టిబిఎం) సాంకేతికతతో నిర్మించనున్నారు. ఇందులో ఒక ట్యూబ్ పూర్తిగా రైల్వే రవాణాకు, మరో ట్యూబ్ రహదారి ప్రయాణానికి కేటాయించనున్నారు. ఈ సొరంగం మొత్తం పొడవు సుమారు 33.7 కిలోమీటర్లుగా ఉండనుంది. అస్సాంలో రవాణా కనెక్టివిటీని పూర్తిగా మార్చే సామర్థ్యం ఈ ప్రాజెక్ట్‌కు ఉందని కేంద్రం భావిస్తోంది.


