పారిశ్రామిక పురోగతిలో సీఐఐది కీలక పాత్ర అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం పారిశ్రామికంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలతో లక్ష్యాలు చేరుకోవచ్చని వివరించారు. 1990 నాటి ఆర్థిక సంస్కరణల ఫలితాలను ఇప్పుడు చూస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ సుస్థిరమైన పాలన అందిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలని మోదీ సూచించారని అన్నారు.
సరైన సమయంలో సరైన నాయకుడిగా మోదీ ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు. ప్రపంచంపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉందని వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్‌పై పడకుండా కేంద్ర ప్రభుత్వం చూసిందని తెలిపారు. ప్రస్తుతం ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్లు క్లీన్ ఎనర్జీ యుగం నడుస్తోందని వివరించారు. వికసిత్ భారత్ దిశగా ముందుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు. భారత ఆర్థికవృద్ధి వేగంగా కదులుతోందని అన్నారు. పెట్టుబడులకు స్వర్గధామం ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు పేర్కొన్నారు.


