ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో యాడమ్స్ టౌన్‌లో తెలుగుదేశం పార్టీ ఎన్ ఆర్‌ఐశాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎపీఎన్ఆర్‌టి చైర్మన్ రవి కుమార్ వేమూరి పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో డబ్లిన్, పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ఎన్‌ఆర్‌ఐలు ఉత్సాహంగా పాల్గొని తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో సాగాయి.
కార్యక్రమం ప్రారంభంలో పార్టీ నాయకులు, సభ్యులు కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధిని కొనియాడుతూ పలువురు ప్రసంగించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాంకేతిక రంగంలో తీసుకొస్తున్న మార్పులు, ప్రజల సంక్షేమానికి చేస్తున్న కృషిని విశేషంగా ప్రశంసించారు. రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి సాధిస్తుందని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఐర్లాండ్ రీజనల్ కో-ఆర్డినేటర్ డా.కిషోర్ బాబు చలసాని మాట్లాడుతూ భారతదేశానికి చెందిన మేధావి వర్గం విదేశాల్లో స్థిరపడుతున్న పరిస్థితిని ప్రస్తావించారు. అలాంటి ప్రతిభావంతులైన భారతీయులు తిరిగి స్వదేశానికి రావడానికి లక్ష్యంగా బ్యాక్ టు హోమ్ అనే బృహత్తర కార్యక్రమానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దిశగా వివిధ పథకాలను అమలు చేయాలనే దృక్పథంతో ఉన్నారని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులు తమ అనుభవం, నైపుణ్యాన్ని స్వదేశ అభివృద్ధికి ఉపయోగించగలరని ఆయన అభిప్రాయపడ్డారు.
కోటేంద్ర లెల్ల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ వేడుకల్లో శ్రీమతి దీప్తి కొణిదల, ప్రసాద్ కొణిదల, గణేష్ గద్దె, రామకృష్ణ, సురేష్ వెల్లూరు, రాజేష్ బాబు పల్లేటి, శుభకర్ రామినేని, ఆనంద్ బొడ్లూరి, నందకిషోర్ దొంతినేని, కె.చంద్ర, ఎల్.రుద్రమూర్తి, డా.కిషోర్ బాబు చలసాని తదితర ప్రముఖులతో పాటు మహిళలు, యువత, పిల్లలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


