టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు ను అమెరికాతో పాటు పలు దేశాల్లో నివసిస్తున్న ఎన్నారై టీడీపీ నేతలు కూడా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా బే ఏరియాలో మే 28న మహానాడు తో పాటు విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, ప్రజా నాయకుడు, కథానాయకుడు నందమూరి తారక రామారావు జయంతిని నిర్వహించబోతున్నారు. శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో ఈ ఏడాది మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. కాలిఫోర్నియాలోని ఫ్రీమోంట్‌లో ఉన్న భీమవరం రుచులు బాంకెట్ హాల్‌లో గురువారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలు కాబోతోంది.
అన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు, మహానాడు.. ఇలా రెండు పండుగలు ఒకేసారి ఒకే రోజు నిర్వహించుకునే చరిత్రాత్మక కార్యక్రమానికి బే ఏరియా టీడీపీ కుటుంబసభ్యులందరూ హాజరు కావాలని నిర్వాహకులు కోరారు.గత ఏడాది బే ఏరియాలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం ఘన విజయం సాధించిందని, బుధవారం వర్కింగ్ డే అయినప్పటికీ ఈ కార్యక్రమానికి బే ఏరియా టీడీపీ కుటుంబ సభ్యులు హాజరయ్యారని నిర్వాహకులు గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా మహానాడు వేదికపై, జూమ్ మీటింగ్ ద్వారా మరెంతో మంది కీలక నేతలు తమ సందేశం ఇవ్వబోతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎన్నారై టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలిరావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.


