మాల్దా జిల్లాలో సర్ విధుల్లో ఉన్న ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించిన ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఆ అధికారుల నిర్బంధం గురించి తనకు తెలియదని, ప్రస్తుతం బెంగాల్ పాలన తన చేతుల్లో లేదని చెప్పారు. కాగా ఈ నెలలో బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో అధికారుల నిర్బంధం ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. సాగర్‌దిఘిలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ అధికారుల నిర్బంధం తనకు తెలియదని, ప్రస్తుతం పాలన తన చేతుల్లో లేదని అన్నారు.
అధికారుల నిర్బంధానికి బాధ్యులు ఎవరో తనకు తెలియదని మమతాబెనర్జీ స్పష్టంచేశారు. ఈ విషయమై తనకు ఎవరూ సమాచారం కూడా ఇవ్వలేదని చెప్పారు. పరిపాలన తన చేతుల్లో లేదని, శాంతిభద్రతలను ఎన్నికల సంఘం నియంత్రిస్తోందని తెలిపారు. వారంతా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట వింటున్నారని అన్నారు. అధికారులను కూడా కేంద్రం మార్చిందని ఆరోపించారు. తన అధికారాలన్నీ ఈసీ చేతిలోకి వెళ్లాయని అన్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్ ) పై ప్రజలు చాలా కోపంగా ఉన్నారని చెప్పారు.


