కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డికె శివకుమార్ పగ్గాలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష (సిఎల్‌పి) నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెంగళూరులోని విధాన్‌సౌధలో జరిగిన సిఎల్‌పి సమావేశంలో శివకుమార్ పేరును ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా సమర్థించారు. పది నిమిషాల్లోనే ఈ సమావేశం ముగియడం విశేషం. సమావేశం అనంతరం సిద్ధరామయ్య, శివకుమార్‌తో కలిసి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధానకార్యదర్శి కెసి వేణుగోపాల్ మాట్లాడారు. శాసనసభలో కాంగ్రెస్ సభాపక్ష నేతగా డికె శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు. జూన్ 3న నూతన ముఖ్యమంత్రిగా శివకుమార్ ప్రమాణం చేయనున్నట్లు తెలిపారు.
పార్టీ అధిష్టాన నేతల ఆధ్వర్యంలో అధికార మార్పు ప్రణాళికాయుతంగా సజావుగా సాగిందని చెప్పారు. అధిష్టాన నిర్ణయాలను అనుసరించి సిద్ధరామయ్య క్రమశిక్షణతో నిబద్ధత చాటారని ప్రశంసించారు. ఆయన అండతో శివకుమార్ నేతృత్వంలో 2028 లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని వేణుగోపాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డికె శివకుమార్ పదవీ స్వీకార ప్రమాణోత్సవాన్ని తొలుత భారీగా నిర్వహించాలని ప్రణాళికలు వేసుకున్నా, ఆఖరి నిమిషంలో నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర గవర్నరు కార్యాలయ భవనం లోక్‌భవన్‌లో జూన్ 3న నిరాడంబరంగా ఈ వేడుక నిర్వహించనున్నట్లు కర్ణాటక కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు జిసి చంద్రశేఖర్ ప్రకటించారు.


